తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇవాళ మంచి ముహూర్తం ఉండటంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్ సమీకృత భవనంలో ఎన్నికల అధికారులకు కేసీఆర్ నామపత్రాలు సమర్పించారు. అనంతరం బయటకు వచ్చిన కేసీఆర్ ప్రచార రథంపై వెళ్తూ.. ప్రజలకు అభివాదం చేశారు.
ప్రచారరథంపై హెలిప్యాడ్ మైదానం చుట్టూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం కేసీఆర్ కామారెడ్డికి బయల్దేరారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ అనంతరం కామారెడ్డిలో నిర్వహించనునున్న ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు.
కేసీఆర్తో పాటు ఇవాళ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి హరీశ్ రాను నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో నామపత్రాలను ఆయన ఎన్నికల అధికారులకు సమర్పించారు. అంతకుముందు ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం సిద్దిపేట చేరుకుని పట్టణంలోని పలు ఆలయాలు, దర్గా, చర్చిలో పూజలు చేసిన అనంతరం నామినేషన్ దాఖలు చేశారు.