బీజేపీ అధికారంలోకి వస్తే ఉత్తరాది రాష్ట్రాల్లానే తెలంగాణ నలిగిపోతుంది : చాడ వెంకట్ రెడ్డి

-

బీజేపీ అధికారంలోకి వస్తే ఉత్తరాది రాష్ట్రాల్లానే తెలంగాణ నలిగిపోతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్​తో కలిశామని తెలిపారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు భారత్ భవిష్యత్​ను దిశా నిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. గుండాలు, కార్పొరేట్లు రాజకీయలను శాసించే స్థాయికి ఎదిగారని వ్యాఖ్యానించారు.

“2014 నుంచి దేశంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.. ఏమైంది..? నల్లదనం తీసుకువచ్చి పేదల ఖాతాల్లో వేస్తామన్నారు అదీ లేదు. ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. కార్మికుల హక్కులు కాలరాస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండానే నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారు. అన్ని వ్యవస్థలపై ముప్పేట దాడి జరుగుతోంది. ధరల పెరుగుదలకు అడ్డూ అదుపూ లేదు. ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు జరిపిస్తోంది. రాజుల కాలంపోయాక ఇంకా రాజద్రోహం కేసు ఏంటి? ఉద్యమ ద్రోహులకు మంత్రులు, ఎమ్మెల్యేలుగా పెద్ద పీట వేస్తున్నారు.” అని చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు.

చిన్న రాష్ట్రం కాబట్టి ఇప్పటి వరకు బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు కేసీఆర్ చెప్పారని.. ఇక నుంచి వామపక్ష, లౌకిక శక్తులతో ముందుకు వెళ్తానని చెప్పారని తెలిపారు. ఈ క్రమంలోనే బీజేపీని నిలువరించేందుకు మునుగోడులో బీఆర్ఎస్​కు మద్దతు ఇచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితులు మారాయని.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పొంగులేటి, తుమ్మల మీద ఐటీ దాడులు జరుగుతున్నాయని.. బీఆర్ఎస్​లో ఉంటే దాడులు జరగలేదని.. కాంగ్రెస్​లో చేరారు కాబట్టే ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news