హైదరాబాద్ బాలాపూర్ లడ్డూ వేలం ప్రశాంతంగా ముగిసింది. బాలాపూర్ గణేశ్ లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. ఈ ఏడాది వేలంలో బాలాపూర్ లడ్డూ రూ.27 లక్షలు పలికింది. ఈ లడ్డూను తుర్కయాంజల్ వాసి దయానందరెడ్డి దక్కించుకున్నారు. అయితే ఈ వేలంలో మొత్తం 36 మంది పాల్గొన్నారు. అందులో 20 మంది స్థానికులు కాగా.. మిగతా 16 మంది ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. అయితే ఈ వేలం పాటలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొన్నారు. అంటే నిజంగా వచ్చి పాల్గొనలేదనుకోండి. కేసీఆర్ తరఫున ప్రతినిధి ఈ వేలంలో పాల్గొన్నట్లు తెలిసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్కు దైవభక్తి ఎక్కువేనన్న విషయం తెలిసిందే. ఆయన ఏ పని చేయాలన్నా ముహూర్తం కచ్చితంగా చూసుకుంటారు. ఇక ఆయన చేసే యజ్ఞాలు, హోమాల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఆయన చాలాసార్లు చండీయాగం చేసిన విషయం తెలిసిందే. ఇక కేసీఆర్ తరచూ దేశంలోని పలు ఆలయాలు సందర్శిస్తుంటారు. ఆయన ఏ రాష్ట్రంలో పర్యటించినా.. మొదట అక్కడున్న ప్రఖ్యాత ఆలయాన్ని దర్శించుకుని భగవంతుడి ఆశీర్వచనం తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొన్నట్లు తెలిసింది. అయితే ఆయన ప్రస్తుతం జ్వరంతో బాధపడుతుండటంతో మహాగణపతిని దర్శించుకునే అవకాశం లేకుండా పోయింది.