ప్రభుత్వ వైద్యులకు సీఎం కేసీఆర్‌ తీపికబురు..ప్రొఫెసర్ల బదిలీలకు పచ్చజెండా

-

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు కేసీఆర్‌ ప్రభుత్వం తీపి కబురు అందించింది. యూజీసీ ఎరియర్స్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు డిఎంఇ పరిధిలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల బదిలీకి పచ్చ జెండా ఊపింది. నెలరోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కాపీలను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు వైద్య సంఘాల ప్రతినిధులకు స్వయంగా అందజేశారు.

కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. భారీగా బడ్జెట్ కేటాయించి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు.. వైద్య సిబ్బందికి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటున్నారని చెప్పారు. మరోవైపు వైద్యారోగ్య శాఖ పరిధిలో భారీగా నియామకాలు జరుపుతున్నామని చెప్పారు. టీఎస్పీఎస్సీ ద్వారా 1479 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశామన్నారు. పీజీ డాక్టర్లను డీహెచ్, టీవీవీపీ నుంచి డీఎంఈ వైపు తీసుకున్నామని చెప్పారు.

ఇలా ఐదేండ్లలో మొత్తం 688 మందిని తీసుకున్నామని అన్నారు. 761 వైద్యులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్లుగా ,545 వైద్యులకు అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్లుగా, 31 మందికి అడిషనల్ డైరెక్టర్లుగా ప్రమోషన్ ఇచ్చామన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నదన్నారు. ఇప్పటికే కొత్తగా 26 మెడికల్ కాలేజీలు వచ్చాయని, కొత్త పోస్టులు క్రియేట్ అయ్యాయన్నారు. దీంతో త్వరగా ప్రమోషన్లు పొందుతున్నారని చెప్పారు. ఒకప్పుడు 20 ఏండ్ల సర్వీస్ తర్వాత ప్రొఫెసర్ ప్రమోషన్లు వచ్చేవని, ఇప్పుడు 7 ఏండ్ల సర్వీసు నిండిన వెంటనే ప్రొఫెసర్ పదోన్నతి పొందుతున్నట్టు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కొందరు అసిస్టెంట్, మరికొందరు అసోసియేట్ ప్రొఫెసర్లుగా రిటైర్డ్ అవుతున్నారని గుర్తు చేశారు. టీచింగ్ ఫ్యాకల్టీ వయస్సు 61 నుంచి 65 ఏళ్లకు పెంచామన్నారు. కొత్తగా క్రియేట్ అయిన ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే పని చేస్తున్న ప్రొఫెసర్లకు ముందుగా అవకాశం ఇచ్చి, మిగిలిన పోస్టుల్లో పదోన్నతుల ద్వారా నింపాలని అనుకుంటున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news