సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జోరు సాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎలక్షన్లో రిపీట్ అయ్యే విధంగా వ్యూహాలు రచిస్తోంది. ఆరు గ్యారంటీల అమలును ఆయుధంగా వాడుతూ ప్రజల్లోకి వెళ్తోంది. ప్రచార బరిలో వేగం పెంచిన కాంగ్రెస్ సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజలను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ నారాయణపేటలో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహిస్తోంది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
ఆరు గ్యారెంటీల అమలును ప్రధానాస్త్రంగా చేసుకుని హస్తం నేతలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు పార్టీ ముఖ్యనేతలు కార్యకర్తలతో సమావేశమవుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. మంత్రులు కూడా ప్రచారంలో పాల్గొంటూ తమ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ఆ దిశగా కార్యాచరణ ముమ్మరం చేసింది. బీజేపీ, బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పిస్తూ.. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.