ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ పాలమూరులో పర్యటించనున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర ముగింపు సభకు సీఎం హాజరుకానున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా జిల్లా కేంద్రానికి రానుండటంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో 15 రోజుల కిందట ప్రారంభమైన వంశీచంద్ యాత్ర 7 నియోజకవర్గాల్లో ముగిసింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో ప్రజాదీవెన బహిరంగసభ పేరుతో కాంగ్రెస్ ముగింపు సభను నిర్వహించనుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా కొడంగల్ కు వచ్చిన రేవంత్ అక్కడ 5వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం, త్వరలోనే ఎమ్మెల్సీ, లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాపై రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది.