తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయండి.. కేంద్రానికి రేవంత్ రిక్వెస్ట్

-

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రెండ్రోజుల పర్యటన నిమిత్తం సోమవారం రోజున దిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులను కలిసి మాట్లాడటంతో పాటు పార్టీకి సంబంధించి హైకమాండ్​తో చర్చలు జరిపేందుకు రేవంత్ దిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం రోజున ఆయన ఇద్దరు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను విన్నవించారు.

కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను కలిసి రాష్ట్రానికి 2.70 లక్షల పట్టణ ఇళ్లను మంజూరు చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. అలాగే స్మార్ట్‌సిటీ పథకం కాలపరిమితిని మరో ఏడాది పొడిగించాలని కోరారు. మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ ఆయన భేటీ అయిన రేవంత్.. హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణ కోసం రక్షణ శాఖకు చెందిన 2,450 ఎకరాల భూమిని తెలంగాణకు అప్పగించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలనుకున్న 25 లక్షల ఇళ్లలో 15 లక్షల ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని.. వాటిని లబ్ధిదారులు చేపట్టే ఇళ్ల (బెనిఫిషియరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానంలో నిర్మిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అందువల్ల ఆ ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస యోజన కింద మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఇంటి నిర్మాణ వ్యయం నిధులనూ పెంచాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version