తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండి, నూతన ఓటర్ల నమోదు చేయించే కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గంలో కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించాలని ఆ మూడు జిల్లాలకు చెందిన నాయకులను కోరారు.
మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు, జిల్లా పార్టీ అధ్యక్షులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో నూతన ఓటర్ల నమోదుకు వచ్చే నెల 6వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత పార్టీ నాయకులు తీసుకోవాలని, ఈ విషయంలో ఏలాంటి అశ్రద్ధ చేయరాదని, విధిగా నూతన ఓటర్ల నమోదుపై నాయకులు దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.