ప్రకృతిని చెర బడితే అది ప్రకోపిస్తుందని.. ప్రకృతి ప్రకోపంతోనే ఉత్తరాఖండ్‌లోనైనా, మన దగ్గరైనా విపత్తులు సంభవిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారీ వర్షాల సమయంలో వరదలు సంభవించి కాలనీలకే కాలనీలే మునిగిపోవడానికి కారణం చెరువులు, నాలాల ఆక్రమణే కారణమన్నారు. హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్ వస్తోందని, కానీ ఎక్కడికక్కడ కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లో ఆక్రమణ తొలగింపును ప్రాధాన్యంగా పెట్టుకున్నామని, చెరువులు, నాలాల ఆక్రమణలో ఎంతటి వారున్నా తొలగింపునకు వెనుకాడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ముందుగా చెరువులు, నాలాల ఆక్రమణపై నివేదిక రూపొందించుకోవాలని, ఏవైనా కోర్టు కేసులు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లో కేవలం ఒక నాలాపై ఆక్రమణలు తొలగిస్తేనే రాం నగర్‌లో ముంపు బారి నుంచి బయటపడిన విషయాన్ని ముఖ్యమంత్రి ఉదాహరించారు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి నివాసంలో మంగళవారం విలేకరులతో ఇష్టాగోష్టిలో, మహబూబాబాద్ జిల్లా సమీక్షలో ఈ విషయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.