యంగ్ సైంటిస్ట్ అశ్విని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. యంగ్ సైంటిస్ట్ అశ్విని కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. సీతారాంపురం తండాలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… భారీ వర్షాలతో ఆకేరు వాగు పొంగి ఇక్కడే యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ మరణించారన్నారు. అశ్విని మాతృమూర్తి, సోదరుడుని పరామర్శించానని వెల్లడించారు. అశ్విని యువ శాస్త్రవేత్త అని… ఆమె మరణం బాధాకరమన్నారు.
ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అశ్విని కుటుంబానికి ఇల్లు లేదు… ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాని ప్రకటన చేశారు. ఆకేరు వాగు పొంగిన ప్రతిసారి సీతారాం తండాతో పాటు పక్కన ఉన్న మరో రెండు తండాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ మూడు తండాలు కలిపి ఒకే పెద్ద గ్రామంగా మార్చేందుకు గాను అందరికీ ఒకే చోట ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని హౌసింగ్ డిపార్టుమెంట్ ను ఆదేశిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.