ఏపీలోని ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై కొందరు బాధితులు పెదవి విరుస్తున్నారు. దీనిని ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా స్పందించారు. విజయవాడలోని ముంపు గ్రామాలు, కాలనీల్లోని అందరికీ ఆహారం, మెడిసిన్స్, తాగు నీళ్లు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత ప్రజలు కాస్త సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. అర్థగంట ఆలస్యమైందని ఆవేశపడితే అది నాలుగైదు గంటలు అయ్యే అవకాశం ఉంటుందని వివరించే ప్రయత్నం చేశారు.
దీనివలన వ్యవస్థలు నాశనం అయ్యే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం 3 బాధిత కుటుంబాలను ఏదో ఒక రూపంలో ఆదుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మానవత్వంతో ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని కోరారు. కాగా, ఏపీలో ప్రస్తుతం వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా వరద మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ బోట్ల ద్వారానే బాధితులకు ఆహారం సరఫరా చేస్తున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారిని పోలీసులు ప్రత్యేకంగా బోట్లలో తరలిస్తున్నారు.