ప్రత్యేక తెలంగాణ కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి తొలిసారి లేఖ ఇచ్చింది చిన్నారెడ్డేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ సభ లో సీఎం మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి కారణమైన పరిస్థితులను వివరించారు. తెలంగాణ ఉద్యమం ఖమ్మంలో లేదని అప్పట్లో ప్రచారం చేశారని, కానీ కొత్త గూడెం నుంచే ప్రారంభమైందని ఆయన తెలిపారు. తమకు ఉద్యోగాలనే నినాదంతోనే ఉద్యమం మొదలైందన్నారు. సంవత్సరం క్రితం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజలు ఓట్లు వేస్తేనే తమకు పదవులు వచ్చాయని వ్యాఖ్యానించారు.
ప్రజల అభిమానంతోనే తాను ముఖ్యమంత్రిని అయ్యాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మార్పు కావాలని, కాంగ్రెస్ రావాలనే నినాదంతో ఎన్నికలకు వెళ్లామని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చామని తెలిపారు. ప్రజల త్యాగాలు, ఆకాంక్షలు తనకు తెలసని, అందుకు అనుగుణంగానే పాలన సాగిస్తున్నానని రేవంత్ చెప్పారు. శాసన సభకు వచ్చి కేసీఆర్ సలహాలు ఇవ్వొచ్చు కదా..? అని ప్రశ్నించారు. కులగణనలో హరీశ్ రావు, కేటీఆర్ ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు.