రూ.లక్ష వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము రూ.7 వేల కోట్లు నేటి (జులై 18వ తేదీ) సాయంత్రం 4 గంటలకు నేరుగా రైతుల రుణఖాతాల్లో జమ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ప్రతి ఓటరుకు కాంగ్రెస్ నేతలు సగర్వంగా చెప్పాలని ఖాతాల్లోకి నగదు జమ కాగానే వారితో కలిసి సంబురాలు చేసుకోవాలని సూచించారు.
‘‘నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఈ నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు, ఆగస్టులో రూ.2 లక్షల వరకు రుణమాఫీతో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఈ విషయాన్ని పోలింగ్ బూత్‌స్థాయి వరకు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి వివరించండి. ఎక్కడికక్కడ పండగ వాతావరణంలో సంబరాలు జరపండి’’ అని సీఎం రేవంత్ నిర్దేశించారు.
రైతులందర్నీ రుణ విముక్తులను చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ పునరుద్ఘాటించారు. కేసీఆర్‌లా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడం లేదని.. చిత్తశుద్ధితో ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. దీనిపై జాతీయస్థాయిలో చర్చ జరగాలన్న ఆయన.. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు.