కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ (ఎన్.డి.ఎస్.ఎ.) ఇచ్చిన నివేదికపై రేపు (మే 18వ తేదీ) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించనున్నారు. వర్షాకాలంలో బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించనున్నారు. ఇప్పటికే ఎన్.డి.ఎస్.ఎ. చేసిన సిఫార్సులు, ఇప్పటివరకు నీటిపారుదల శాఖ తీసుకొన్న చర్యలు, వర్షా కాలంలోగా చేయాల్సిన పనులపై సమీక్షించనున్నట్లు సమాచారం.
మరోవైపు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈరోజు ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఎన్.డి.ఎస్.ఎ. సూచనలను అమలు చేయడం, బ్యారేజీ మరమ్మతులకు అయ్యే వ్యయాన్ని ఒప్పందం ప్రకారం గుత్తేదారు భరించడం, దీనికి గుత్తేదారు అంగీకరించకపోతే ఏం చేయాలనే దానిపై సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం. మరమ్మతులు చేసినా వరద స్వభావాన్ని బట్టి బ్యారేజీకి నష్టం వాటిల్లదని చెప్పలేమని ఎన్.డి.ఎస్.ఎ. పేర్కొన్న నేపథ్యంలో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.