కష్టపడే గుణం వల్ల క్షత్రియులు ఎక్కడైనా విజయం సాధిస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. విజయానికి, నమ్మకానికి క్షత్రియులు మారు పేరు అన్నారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని ప్రశంసించారు.
అలాగే హైదరాబాద్ అభివృద్ధిలో రాజుల పాత్ర కూడా ఉందన్నారు. కొంపల్లిని పెద్ద నగరంగా చేసింది క్షత్రీయులే అన్నారు. మీడియా రంగంలో రాజులే రాణిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే కృష్ణంరాజు పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్పలేమన్నారు. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధకరం అన్నారు. బాలీవుడ్ లో సత్తా చాటిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తనకు మంచి మిత్రుడు. హాలీవుడ్ రేంజ్ సినిమా ప్రభాస్ లేకుండా ఊహించలేమన్నారు. రాజులను చట్టసభల్లోకి తీసుకుపోవాలనే ఆలోచన ఉంది. తొలుత పార్టీలో అవకాశం ఇస్తాం.. ఆ తరువాత ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తామని మాట ఇస్తున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.