తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన డీ-లిమిటేషన్, ఇతర అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా కక్షపూరిత రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే కేటీఆర్ ఇప్పటికే చంచల్ గూడ జైలులో ఉండేవారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతీకార రాజకీయాలు తనకు రావని.. నేను అలా చేసుంటే ఇప్పటికే కొందరు జైల్లో ఉండేవారని వ్యాఖ్యానించారు.
అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగరవేస్తే రూ.500 జరిమానా విధిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డ్రోన్ ఎగరవేశారని ఒక ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైలులో వేశారని గుర్తు చేశారు. జరిమానా వేసే కేసులో జైలులో పెట్టి వేధించారని.. తన బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిల్‌పై వచ్చి వెళ్లానని తెలిపారు. తాను కూడా అలా ప్రతీకార రాజకీయాలు చేయదలిస్తే.. ఇప్పటికే కొందరు జైలులో ఉండేవారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.