తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగతున్నాయి. మరోవైపు ఆరోజున వివిధ రకాల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే జూన్ 2వ తేదీన రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణను ఆవిష్కరించనున్నారు. మరోవైపు రాష్ట్ర చిహ్నంలో కూడా మార్పులు చేసి ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ రాజకీయ పార్టీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు సీఎం అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పుపై వివిధ పార్టీలతో చర్చించనున్నారు. చిహ్నంలో రాచరికపు గుర్తులను తొలగించాలని ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం ప్రతిబింబించేలా రాష్ట్ర కొత్త చిహ్నం రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయం కోసం ఇవాళ వారితో చర్చ కానున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.