తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణనను సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు విధాలుగా సమీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. సమగ్ర ఇంటింటి సర్వే పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరుస రివ్యూలు చేస్తున్నారు. తాజాగా ఆయన కలెక్టర్లు, జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ ఇంటి నుంచి వివరాలను సేకరించడం పై దిశా నిర్దేశం చేశారు.
ముఖ్యంగా నవంబర్ 06 నుంచి ప్రారంభమయ్యే కులగణన కోసం పాఠశాల సమయం ముగిసిన తరువాత ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. స్కూల్ ముగిసిన తరువాత ఒక్కో ఉపాధ్యాయుడు రోజు 5 నుంచి 7 ఇళ్లలో వివరాలను సేకరించాలన్నారు. ఇందులో పాల్గొనే ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు మంచి వేతనం ఇస్తామని చెప్పారు. ప్రజలను అడగాల్సిన 50 ప్రశ్నలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా సూపర్ వైజర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించి ఆచరణాత్మక ఇబ్బందులపై చర్చంచి తగిన సూచనలు చేయాలన్నారు.