ప్రాజెక్టుల అప్పగింతపై కేసీఆర్‌ గొంతు విప్పాకే సర్కారు స్పందించింది : హరీశ్ రావు

-

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల అంశంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరుగుతోంది. సాగునీటి ప్రాజెక్టుల అంశంపై తీర్మానం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టారు. సాగునీటి ప్రాజెక్టులు అప్పగించబోమని ఆయన తీర్మానం పెట్టగా.. దానిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య చర్చ జరుగుతోంది.

ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని కేసీఆర్ హయాంలోనే ఒప్పుకున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఆరోపణలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. తెలంగాణ ఇంజినీర్లు డ్యామ్‌లపైకి వెళ్లాలంటే కేఆర్‌ఎంబీ అనుమతి కావాలని, ప్రాజెక్టుల అప్పగింతపై జనవరి 18నాటి అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయని హరీశ్ రావు తెలిపారు. అన్ని పత్రికల్లో వార్తలు వచ్చినా ప్రభుత్వం స్పందించ లేదని నిలదీశారు.

తాను జనవరి 19న ప్రెస్‌ మీట్‌ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించానని, జనవరి 17నాటి భేటీ మినిట్స్‌ మరునాడే బయటకు వచ్చాయని తెలిపారు. మినిట్స్‌లో తప్పు ఉందని జనవరి 27న మంత్రి కేంద్రానికి లేఖ రాశారని, మరి మంత్రి పది రోజులపాటు ఏం చేశారు.. ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నల్గొండ సభ కారణంగానే ఇప్పుడు తీర్మానం పెట్టారని హరీశ్‌ రావు అన్నారు. ప్రాజెక్టుల అప్పగింతపై కేసీఆర్‌ గొంతువిప్పాకే సర్కారు స్పందించిందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు అప్పగించవద్దన్న తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version