మరో రెండ్రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఇప్పటికీ ఇంకా అభ్యర్థుల జాబితాపై ఓ క్లారిటీకి రానట్టే తెలుస్తోంది. అభ్యర్ధుల ప్రకటన విషయంలో అధిష్ఠానం తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇవాళ దిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్ర అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు దిల్లీ చేరుకున్నారు.
మూడు దఫాలు స్క్రీనింగ్ కమిటీ సమావేశమై వందకుపైగా నియోజక వర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక కసరత్తు పూర్తి చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇవాళ్టి సీఈసీ భేటీలో రాష్ట్ర అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఇప్పటివరకు ఖరారుకాని కొన్ని స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు సమాచారం. 15న 60 నుంచి 65 స్థానాలకు తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ అంచనా వేస్తోంది. వామపక్షాల పొత్తులు కొలిక్కి రాకపోవడం, మరికొందరు పార్టీలో చేరేవారున్న దృష్ట్యా ఆ దిశలో కసరత్తు జరుగుతోంది.