తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే తాజ్ కృష్ణకు చేరుకున్నారు. ఈ రోజు రాత్రి సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థిని కూడా రేపే ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరోవైపు డీజీపీతో తన నివాసంలో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. త్వరలో గవర్నర్ను కలవనున్నట్లు డీజీపీకి రేవంత్ తెలిపినట్లు సమాచారం. ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని రేవంత్ సూచించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉండగా.. ప్రభుత్వం ఏర్పాటుకు 60 స్థానాలు అవసరం. పార్టీ గెలుపుపై ఇప్పటికే పలువురు నేతలు స్పందించారు. తమకు ఓ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే తాము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పారు.