కాంగ్రెస్‌ విజయానికి ఇవీ కారణాలు

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్ట మైన మెజారిటీ సాధించింది కాంగ్రెస్‌ పార్టీ. మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటి 65 సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటోంది అనే స్థాయి నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా విజయవంతంగా ప్రయాణం సాగించింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో పాటు,కొడుకు మంత్రి కె తారకరామారావు,కుమార్తె కవిత, హరీష్‌రావు వంటి ముఖ్యనేతలు బీఆర్‌ఎస్‌ ప్రచార పర్వాన్ని భుజానికెత్తుకున్నారు. ఊరూరా సభలు నిర్వహించిన సీఎం కెసీఆర్‌ను ఆహ్వానించి జనరంజకంగా ప్రసంగాలు దంచారు. అలాగే తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న బీజెపీ సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌షా,ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు.ఈసారి మార్పను కోరుకున్న తెలంగాణ ప్రజలు బడానేతలను కాదని హస్తం పార్టీకి అధికారం కట్టబెట్టారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. రాజకీయంగా చోటుచేసుకున్న మార్పులు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మారాయి.అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను బీజేపీ అధిష్టానం తొలగించింది.అప్పటివరకు హుషారుగా ఉన్న బీజేపీ కేడర్‌…అధిష్టానం నిర్ణయంతో ఒక్కసారిగా డీలా పడిపోయింది.అలాగే కేసీఆర్ కుమార్తె కవితను మద్యం స్కామ్‌లో అరెస్టు చేయకపోవడం వంటి పరిణామాలతో బీజేపీ నాయకత్వంతో కేసీఆర్ ఒక విధమైన పొత్తు కుదుర్చుకున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఎన్డీయే కూటమిలో స్థానం కల్పించాలని కోరుతూ కేసీఆర్ తనను సంప్రదించారని మోదీ చేసిన ప్రకటన కూడా ఆ పార్టీకి మైనస్‌ అయింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తి తెలివిగా వ్యవహరించి విజయం సాధించిందనే చెప్పాలి. రేవంత్ రెడ్డి సారథ్యంలో దూకుడు పెంచిన కాంగ్రెస్‌….కేసిఆర్‌ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేసింది.

ఇవే కాదు మరికొన్ని అంశాలు కూడాకాంగ్రెస్‌ పార్టీకి కలిసి వచ్చాయి. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. అదే వేవ్‌ను తెలంగాణలోనూ కంటిన్యూ చేశారు.కర్నాటకలో విజయాన్ని తొలి అడుగుగా మార్చుకున్న కాంగ్రెస్‌ తెలంగాణలో కూడా పాగా వేయాలని భావించి సీరియస్‌గా దృష్టి సారించింది.తెలంగాణలో చేపట్టిన ఈ యాత్రకు ఊహించని రీతిలో జనాన్ని తరలించి పాజిటివ్‌ వేవ్‌ తెచ్చారు.మోదీని,కేసీఆర్‌ని వదిలిపెట్టని రాహుల్‌గాంధీ ధైర్యంగా ప్రచార పర్వాన్ని సాగించారు. అవినీతి విషయంలో కేసీఆర్‌కి మించిన వ్యక్తి లేడని చెప్పిన రాహుల్‌ గాంధీ…బీజేపీ,బీఆర్‌ఎస్‌ ఒక్కటేననే బలమైన సంకేతాలను జనాల్లోకి పంపారు. రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేక వ్యాఖ్యలతో ముస్లింల ఓట్లను రాబట్టగలిగారు.అలాగే ఓవైసీ సోదరులను లక్ష్యంగా చేసుకుని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు ముస్లిం ఓటర్లలో బలంగా నాటుకున్నాయి. ఒవైసీ,… బీజేపీతో అంతర్గత పొత్తు ఏర్పారచుకున్నారని రాహుల్‌ ఆరోపించారు.జాతీయ స్థాయిలో బిజెపితో పోరాడగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ అనే రాహుల్‌ వ్యాఖ్యలకు ఓటర్లు జైకొట్టారు. దీంతో తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ముస్లింల మద్దతివ్వడమే పెద్ద చర్చనీయాంశంగా మారింది, ఇది ఒవైసీ , కేసీఆర్‌ను ఇరుకున పెట్టింది.

కర్ణాటకలో కాంగ్రెస్ అపూర్వ విజయం తెలంగాణ ఓటర్లను కూడా ప్రభావితం చేసింది. కర్నాటకలో గెలుపొందిన ఓటర్లు, పార్టీ కేడర్‌లో కేసీఆర్‌ను అడ్డుకునే సత్తా కాంగ్రెస్‌కు ఉందన్న మానసిక స్థైర్యాన్ని నింపింది. పొరుగు రాష్ట్రంలో బీజేపీ లాంటి మహాకూటమిని కాంగ్రెస్‌ గద్దె దించగలిగితే తెలంగాణలోనూ పునరావృతమయ్యే అవకాశం ఉందని ప్రజలు విశ్వసించడం ప్రారంభించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించడం కూడా మరో ముందడుగు. ఒక్కో అంశంలో కేసీఆర్‌పై ఆయన ముందంజ వేసి మాటలతో చేసిన దాడి కాంగ్రెస్‌ను ప్రతిపక్ష రాజకీయాలకు కేంద్రంగా మార్చింది. ఒవైసీ పార్టీ బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడంతో బీజేపీ మెతక వైఖరి అవలంభించింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై బండి సంజయ్ చేసిన దూకుడు తెలంగాణాలో బీజేపీని ప్రతిపక్షంలో నిలబెట్టింది. అయితే ఆ తరువాత ఇద్దరి మధ్య పొత్తు కుదిరిందనే వార్తలతో బీజేపీ బలహీనపడిపోయింది.

తెలంగాణలో గత కొంతకాలంగా కేసిఆర్‌ సర్కారుపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వాన్ని అగమ్యగోచర ప్రభుత్వంగా చాలా కాలంగా చూస్తున్నారు. సామాన్యులతో బహిరంగ సభలు నిర్వహించే సంప్రదాయానికి కేసీఆర్ స్వస్తి పలికారు. తన ఫామ్‌హౌస్‌ నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. అతని పాలనలో, అతని కుటుంబ సభ్యులే పదవుల్లో కొనసాగడం,అక్రమ సంపాదన పై కాంగ్రెస్‌ నేతలు పదే పదే ఆరోపణలు చేశారు. అధికారంలోకి రాకముందు గెలిస్తే దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఇచ్చి గెలిచాక ఆ హామీని పక్కనపెట్టడం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది.వరుసగా రెండుసార్లు అవకాశం ఇచ్చినా దళితులను పట్టించుకున్న పాపాన పోలేదు కేసీఆర్‌. అంతేకాదు కేవలం కుటుంబ సభ్యులతో పాలన చేయించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.వీటికి తోడు కేసీఆర్ తమ పార్టీ పేరు మార్చడం కూడా కాస్త మైనస్ అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సొంత రాష్ట్రాన్ని బాగుచేయలేని వ్యక్తి దేశ రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేస్తారనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ కారణాలన్నీ, ఇప్పుడు కాంగ్రెస్ కి అనుకూలంగా మారాయి.ప్రస్తుతం సాధించిన విజయంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version