కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్కాములు, కమీషన్ల ప్రభుత్వం : హరీశ్ రావు

-

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్కాములు, కమిషన్ల ప్రభుత్వం అని మరోసారి రుజువు అయిందని హరీశ్ రావు పేర్కొన్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు హరీశ్ రావు.  “ఢిల్లీలో తమ బాస్ లకు కప్పం కట్టేందుకు అన్ని వర్గాల నుంచి మంత్రులు లంచాలు తీసుకుంటున్నారని లోకం కోడై కూస్తోంది. కాంట్రాక్టర్లు ఈ రోజు సచివాలయంలోని ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు చేసిన ధర్నాఆ లంచాల ఆరోపణలు నిజమే అని నిరూపించింది. 20 శాతం కమీషన్ తీసుకుంటున్నారంటూ కాంట్రాక్టర్లే స్వయంగా సచివాలయానికి వచ్చి ధర్నా చేయడం గతంలో కనీ విని ఎరుగని ఘటన.

ఇది తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు మాయని మచ్చ. రాహుల్ గాంధీ తాను చెప్పే నీతి సూత్రాలపై ఏమాత్రం నమ్మకం ఉన్నా తక్షణమే సచివాలయంలో కాంట్రాక్టర్లు మంత్రులపై చేసిన అవినీతి ఆరోపణలపై స్పందించాలి. కాంట్రాక్టర్లు చేస్తున్న తీవ్రమైన అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సుమోటోగా స్పందించి చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ శక్తివంచన లేకుండా పోరాడుతుంది. ప్రతి వేదిక మీద కాంగ్రెస్ అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తాం. బడా కాంట్రాక్టర్లకు కమీషన్లు తీసుకుని బిల్లులు చెల్లిస్తూ చిన్న కాంట్రాక్టర్లకు, మాజీ సర్పంచ్ లకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఆపడం అన్యాయం. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దిన మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడం అమానుషం. తక్షణమే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి. పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్థిక శాఖ నుంచి జరిగిన అన్ని చెల్లింపుల పై శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం” అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news