మాది ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకునే భట్టి విక్రమార్క.. బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్లు సచివాలయానికి వస్తే ఎందుకు పోలీసులను అడ్డు పెట్టుకొని వెనుక గేటు నుంచి వెళ్లిపోయారని ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా హరీశ్ రావు పోస్ట్ చేశారు. “ఎందుకు ముఖం చాటేసారు? ప్రజా ప్రభుత్వం అంటే పలాయనం చిత్తగించడమేనా? కాంగ్రెస్ ప్రభుత్వ కమిషన్ల కక్కుర్తి నేడు సచివాలయం సాక్షిగా బట్టబయలైంది. తమ పెండింగ్ బిల్లుల పై సర్పంచ్ లు రోడ్డెక్కినా కాంగ్రెస్ ప్రభుత్వం కరుణించడం లేదు.. కానీ కమీషన్ల కు ఆశపడి మంత్రులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న వైనం కాంట్రాక్టర్ల సచివాలయంలో చేసిన ఆందోళనతో నిరూపితమైంది.
పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 6 వేల కోట్ల రూపాయలు బాకీ పడింది. చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ఆ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది . కాంట్రాక్టర్ల తరహాలోనే ఉద్యోగులు కూడా తమ బకాయిలు తాము పొందేందుకు కమిషన్లు ఇవ్వాల్సిందేనా? బకాయిలు చెల్లించాలంటూ కొందరు సెల్ఫీలు తీసి వీడియోలు పెడితేనో, కోర్టులకు వెళ్తేనో ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తున్నారు తప్ప నిబంధనల ప్రకారం రావాల్సిన వాటిని కూడా పెండింగ్ లో పెడుతున్నారు” అని ప్రశ్నించారు.