పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించింది : మంత్రి కేటీఆర్

-

మునుగోడు నియోజకవర్గం 2022 ఉప ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆమె పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నో మైలురాళ్లను అధిగమించామన్నారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయన్నారు.

ఎన్నికలు వస్తుంటయ్‌.. పోతుంటయ్‌. కానీ మునుగోడులో ఎందుకు ఉపఎన్నికలు వచ్చాయో, రాజగోపాల్‌ రెడ్డి ఎందుకు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లారో.. ఇప్పుడు అదే పార్టీలోకి ఎందుకు తిరిగొచ్చారో ఆయనకే తెలియాలన్నారు. పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుటుంబ నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉందన్నారు. ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి పేరుచెప్పుకొని కాంగ్రెస్‌ పార్టీకి ఆమాత్రం ఓట్లయిన వచ్చాయన్నారు. పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్‌ అవమానించిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఒకరినొకరు తిట్టుకున్న రేవంత్‌ రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి ఇప్పుడు ఒక్కటయ్యారని విమర్శించారు. డబ్బుమదంతో రాజకీయాలు చేస్తున్న రాజగోపాల్‌ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ధన రాజకీయాలను తిరస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. మునుగోడు బిడ్డలు మరొకసారి తెగువ చూపాలని, రాజగోపాల్‌ రెడ్డి అహంకారాన్ని, ధనమదాన్ని వంచాల్సిన అవసరం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version