కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌తో దర్యాప్తు జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జీ.నిరంజన్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు భద్రత గాలిలో దీపంలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర ప్రజల భద్రతతో ముడిపడి ఉన్న సమస్యగా పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు భారీ పగుళ్లు ఏర్పడ్డి అడుగున్నరకు పైగా కుంగాయని తెలిపారు. గత నెల 23 నుంచి 25వ తేదీ వరకు మూడు రోజులపాటు రాష్ట్ర పర్యటన చేసిన డ్యామ్ సేప్టీ అథారిటీ అధికారులు 20 అంశాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరారు. కేవలం 11 అంశాలపైనే ప్రభుత్వం వివరాలు ఇచ్చిందని అవి కూడా అసంపూర్ణంగా ఉన్నట్లు ప్రాజెక్టుల పరిరక్షణ అథారిటీ పేర్కొంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని సీబీఐ విచారణకు ఆదేశించాలని రాష్ట్రపతికి నిరంజన్ విజ్ఞప్తి చేశారు.