తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాల ఎంపికను షురూ చేసింది. ఇందు కోసం లోక్ సభ నియోజకవర్గాల వారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 17 లోక్ సభ స్థానాల నుంచి 309 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సగటున ఒక్కో నియోజకవర్గానికి 18 మందికి పైగా టికెట్ కోసం పోటీ పడుతున్నట్లు వెల్లడించాయి.
ముఖ్యంగా ఎస్టీ రిజర్వ్ స్థానమైన మహబూబాబాద్ నుంచి అత్యధికంగా 47 మంది దరఖాస్తు చేసుకున్నట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. వరంగల్ నుంచి 40 మంది, పెద్దపల్లి నుంచి 29 మంది, భువనగిరి నుంచి 28 మంది ఉన్నట్లు వెల్లడించాయి. మహబూబ్నగర్లో అతి తక్కువ అర్జీలు కేవలం నాలుగు మాత్రమే వచ్చినట్లు వివరించారు. జహీరాబాద్ నుంచి ఆరుగురు దరఖాస్తు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అర్జీలకు సంబంధించి నియోజకవర్గం వారీగా గాంధీ భవన్ వర్గాలు జాబితాను సిద్ధం చేస్తున్నాయి. రేపు గాంధీ భవన్లో జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీలో ఈ ఆశావహుల జాబితాపై చర్చించనున్నారు.