నేడు దిల్లీలో కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ సమావేశం

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇప్పుడు ఆ దరఖాస్తులను వడబోసి అభ్యర్థులను ఎంపికచేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఇవాళ, రేపు దిల్లీలో స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం కానుంది. సమావేశమై శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయనుంది.

ప్రదేశ్ ఎన్నికల కమిటీ- PEC ప్రతిపాదనలపై ఇప్పటికే సర్వే పూర్తైనట్లు తెలుస్తోంది. సర్వేలు, సామాజిక, స్థానిక రాజకీయ స్థితిగతుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే 20కి పైగా నియోజకవర్గాల్లో పీఈసీ ఒక్కరి పేరునే సూచించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. వారిలోనూ ప్రత్యర్థులతో తలపడే శక్తి సామర్థ్యం ఉందా లేదా కోణంలోనూ సర్వే నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం.

25 నుంచి 30 చోట్ల ఇద్దరి పేర్లు, దాదాపు 50 నియోజకవర్గాలకు ముగ్గురు, మరో 10 నుంచి 14 నియోజకవర్గాలకు నలుగురి పేర్లను… స్క్రీనింగ్ కమిటీకి పీఈసీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. పీఈసీ జాబితాను నిశితంగా పరిశీలించి కేంద్ర ఎన్నికల కమిటీకి.. స్క్రీనింగ్‌ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news