టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, లోక్ సభలో బీజేపీ ప్రతిపక్ష నాయకురాలు, సుస్మాస్వరాజ్ జయంతి వేడుకలు శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ చిత్రపటానికి ఎంపీ ఈటల రాజేందర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదిలాబాద్- నిజామాబాద్-మెదక్-కరీంనగర్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమురయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి, ఖమ్మం-వరంగల్-నల్లగొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తంరెడ్డిలు బీజేపీ తరఫున బరిలో ఉన్నారని చెప్పారు.
ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పరంగా అభ్యర్థిని నిలబెట్టలేక పోయిందన్నారు. కాంగ్రెస్ కూడా ఆయన మా అభ్యర్థి అని నిలిపే ప్రయత్నం చేయలేదు.. అని విమర్శించారు. టీచర్ల ట్రాన్స్ఫర్స్ సమయంలో 317 జీఓ వస్తే దానికి వ్యతిరేకంగా బరిగీసి కొట్లాడిన పార్టీ బీజేపీ అని స్పష్టంగా టీచర్లలో ఉందన్నారు. ఆనాడు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పి టీచర్ల దుఃఖానికి కారణం అవుతున్న పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. నాటి టీచర్ల బాధ ఇంకా కొనసాగుతుందని అన్నారు.