తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఆర్థిక క్షీణతకు అసలు కారణాలను వివరించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ వారికి బుద్ధిమాంద్యం అని వ్యాఖ్యానించడంతో శాసనసభలో వివాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ బీఆర్ఎస్ నేతపై మండిపడ్డారు.
సభా నాయకుడిని పట్టుకొని అజ్ఞానం అనడం.. కాంగ్రెస్ వారికి బుద్ధిమాంద్యం ఉందని మాట్లాడటం సరికాదని భట్టి హితవు పలికారు. హరీష్ రావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుండా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తరహాలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన విజ్ఞులైతే స్పీకర్ చెప్పింది విని తాను మాట్లాడిన ఆ మాటను ఉపసంహరించుకోవాలని సూచించారు. తమకు బుద్ది ఉందో లేదో లెక్కలు వేసుకుని చెబుతామంటూ భట్టి వ్యాఖ్యానించారు. సభా నాయకుడు, ప్రభుత్వ పెద్దల గురించి సరైన భాష వాడాలని సూచించారు. సభాపతి సైతం వాదనలు ఎందుకంటూ ఘాటుగా స్పందించారు.