మొన్నటిదాక టమాట.. ఆ తర్వాత మిర్చి, ఉల్లి ధరలు సామాన్యులను బెంబేలెత్తించాయి. ఇక ఇప్పుడు కందిపప్పు, బియ్యం, జీలకర్ర, పాలు వంటి నిత్యావసరాల ధరలు మళ్లీ హడలెత్తిస్తున్నాయి. ఇలా ఒకదాని వెంట మరొకటి ధరలు పెరుగుతూ వెళ్తుంటే అయిదు వేళ్లు నోట్లోకెళ్లేదెలా అంటూ మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేసవిలో అకాలవర్షాలు, ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ కారణంగానే ప్రస్తుతంధరలు మండిపోతున్నాయని వర్తకులు అభిప్రాయపడుతున్నారు.
కందిపప్పు కిలో ధర ఆరు నెలల్లోనే దాదాపు 50శాతం పెరిగింది. ఫిబ్రవరిలో రూ.110-120 ఉంటే ప్రస్తుతం రూ.170కి చేరింది. మినపపప్పు ధర కిలో రూ.110 నుంచి నెల రోజుల్లోనే రూ.130కి పెరిగింది. జీలకర్ర కిలో రూ.700కుపైగా పలుకుతోంది. సెనగపప్పు రూ.65 నుంచి రూ.75-80కి చేరింది. పాలు లీటర్‌కు రూ.5 చొప్పున పెంచారు. నాణ్యమైనవైతే రూ.80-100 వరకు తీసుకుంటున్నారు. చింతపండు ధర కిలో రూ.150కి పెరిగింది. వంట నూనెలు, అల్లం, వెల్లుల్లి ధరలు కాస్త అందుబాటులోకి రావడం ప్రజలకు ఉపశమనంగా ఉంది.