ధరణి సమస్యలపై అధ్యయనం చేస్తున్న కమిటీ ఇవాళ ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుంది. ఇప్పటికే మూడు దఫాలు సమావేశమైన కమిటీ అనేక అంశాలపై ఆరా తీసింది. అయితే త్వరలో మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వ పథకాల అమలుకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ కమిటీ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు 10.30 గంటలకు సచివాలయంలో కలెక్టర్లతో సమావేశం కానుంది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించనుంది.
ధరణి సమస్యలపై మరింత సమాచారం కోసం సిద్దిపేట, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో కమిటీ ఈరోజు సమావేశం కానుంది. ధరణి వెబ్ సైట్‌ను అందుబాటులోకి తెచ్చిన తరువాత ఉత్పన్నం అవుతున్న సమస్యలు, వాటిని ఏవిధంగా పరిష్కరించొచ్చు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. మరోవైపు తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలో విచారించాల్సిన అంశాలు ఏవైనా ఉన్నాయా అనే విషయాలపైనా కలెక్టర్లను ఆరా తీయనున్నాయి. గతంలో నిజామాబాద్‌లో జరిగిన భూ భారతి ఫైలెట్ ప్రాజెక్టు తాజా పరిస్థితిపై ఆ జిల్లా కలెక్టర్‌తో కమిటీ సభ్యులు చర్చించనున్నట్లు సమాచారం.