లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 16న జరగవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలిక సూచన జారీ చేసిందని జిల్లా ఎన్నికల అధికారులకు దిల్లీ ఎన్నికల ముఖ్య అధికారి కార్యాలయానికి చెందిన అసిస్టెంట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఈనెల 19న జారీచేసిన సర్క్యులర్ నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలకు అవసరమైన ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆ నోట్లో పేర్కొనడం గమనార్హం. ఈ నోట్ వైరల్ కావడంతో దిల్లీలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 16న జరగబోతున్నట్లు చర్చ షురూ అయింది.
ఈ పుకార్లపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. జిల్లా స్థాయిలో ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి అధికారులకు ఒక గడువిస్తూ ఆ తేదీని పేర్కొన్నామని స్పష్టం చేసింది. అంతే తప్ప అది కచ్చితమైన తేదీ కాదని వెల్లడించింది. లోక్సభ ఎన్నికల కోసం ముందుగా అనేక పనులు ఉంటాయన్న సీఈసీ తెలిపింది. వీటన్నింటిని పూర్తి చేసేందుకు ఓ తాత్కాలిక తేదీని నిర్ణయిస్తామని.. దీనికి అనుగుణంగా మిగిలిన కార్యక్రమాల ప్రారంభ, ముగింపు తేదీలు నిర్ణయించుకుని ఎన్నికల కార్యకలాపాలను పూర్తి చేస్తామని పేర్కొంది. వీటిలో అధికంగా జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో జరగుతుండటం వల్ల 2024 ఏప్రిల్ 16న తాత్కాలిక తేదీగా నిర్ణయిస్తూ 2024 జనవరి 19న ఉత్తర్వులు జారీ చేశామని స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల తేదీని భారత ఎన్నికల సంఘం సరైన సమయంలో ప్రకటిస్తుందని క్లారిటీ ఇచ్చింది.