ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, భవిష్యత్తు లేదని అర్థమై ఇతర పార్టీలపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. సింగరేణిలో 63 వేల ఉద్యోగుల నుంచి 43 వేల ఉద్యోగులకు తగ్గారు అన్నారు. అయినా ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పించలేకపోయారు అని ఆయన తెలిపారు.
3500 కోట్ల మిగులుతో ఉన్న సింగరేణి రూ. 8 వేల కోట్లు అప్పులపాలు అయిందన్నారు. ధరణి వెబ్సైట్ తెలంగాణ రైతాంగానికి శాపంగా మారిందని వ్యాఖ్యానించారు ఈటెల రాజేందర్. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూదాన్, ల్యాండ్ సీలింగ్ భూముల పై ప్రభుత్వం కన్ను పడిందన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములను గింజుకుంటూ ప్రైవేటు వ్యక్తులకు, కంపెనీలకు అమ్ముతూ ప్రభుత్వం కూడా బ్రోకర్ పని చేస్తుందంటూ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.