బీసీ కులగణన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తెలంగాణ కుల సర్వేలో బీసీల తప్పుడు లెక్కలపై జరుగుతున్న చర్చను పక్కదోవ పట్టించడానికే ప్రధాని మోదీ బీసీనా.. కాదా..? అనే చర్చకు సీఎం రేవంత్ రెడ్డి తెర లేపారని ఎక్స్ వేదికగా ఆరోపించారు. రాహుల్ గాంధీది ఏ మతమంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ చర్చను కొనసాగించే ప్రయత్నం చేశారని కవిత మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. మోదీ బీసీ అయితే మాకేంది.. ఓసీ అయితే మాకేంది..? అని ఆమె ప్రశ్నించారు. బీసీల జనాభాను కరెక్టుగా లెక్కించాలనేదే తమ డిమాండ్ అని చెప్పారు. పక్కా లెక్కలతో అసెంబ్లీలో కాంగ్రెస్ బిల్లు పెట్టాలని.. దాన్ని కేంద్రంలో బీజేపీ ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు చట్టబద్దంగా చెల్లుబాటు అయ్యేలా.. న్యాయ వివాదాలకు తావు లేకుండా కోర్టుల్లో నిలబడేలా ప్రభుత్వం బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత.