తునిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మూడు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ మరోసారి తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నికను నిర్వహించనున్నారు. వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరారు. బారికేడ్లను దాటుకొని టీడీపీ కార్యకర్తలు దూసుకురావడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. వైసీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు.
గుంపులు గుంపులుగా మున్సిపల్ కార్యాయలానికి వెళ్లారు కూటమి కార్యకర్తలు. పలువురు వైసీపీ నేతలు తునికి రావాలని ప్రయత్నిస్తే.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. బయటివాళ్లు ఎవ్వరూ కూడా రావద్దని నిన్ననే డీఎస్పీ సూచించారు. అయినప్పటికీ పలువురు వైసీపీ నేతలు తునికి రావడానికి ప్రయత్నిస్తే.. వారిని అడ్డుకొని వారి ఇండ్లలోకి పంపించారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. తుని మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.