తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు కీలకదశకు చేరుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని విస్తృతం చేస్తోంది. పోలింగ్కు మరో నాలుగు రోజులే గడువు ఉన్న సమయంలో జాతీయ నేతలను రంగంలోకి దింపుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ రాష్ట్రంలో పర్యటిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో రిపీట్ అవుతుందని డీకే శివకుమార్ అన్నారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం, సమిష్టి నాయకత్వం ఎక్కువ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయమూ ఏకపక్షంగా తీసుకోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గెలిస్తే.. రియల్ ఎస్టేట్ పడిపోతుందనేది అసంబద్ధ వాదన అని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని తెలిపారు. చంద్రబాబు, వైఎస్‌ఆర్ హయాంలోనూ హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. పార్టీ కోసం కష్టపడిన అందరికీ అవకాశాలు వస్తాయని చెప్పారు. టికెట్ రాని నేతలకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామన్న డీకే.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన మరుసటిరోజు నుంచే ఐదు గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.