హైదరాబాద్ పరిసరాల్లో త్వరలో డ్రోన్ పోర్ట్ రాబోతోంది. ఈ పోర్ట్ నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన 20 ఎకరాల స్థలం కోసం ఫార్మా సిటీ వైపు భూములను పరిశీలించాలని చెప్పారు. అయితే స్థలం కేటాయింపు ఏవియేషన్ నిబంధనల ప్రకారం అభ్యంతరం లేని జోన్‌లోనే జరగాలని సూచించారు.
ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్‌ఆర్‌ఎస్‌సీ)తో డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణపై తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అవగాహన ఒప్పందం చేసుకుంది. బుధవారం రోజున సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్.ఎన్.రెడ్డి, ఎన్‌ఆర్‌ఎస్‌సీ డైరెక్టర్ ప్రకాశ్ చౌహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, ఎన్‌ఆర్‌ఎస్‌సీ డిప్యూటీ డైరెక్టర్ మురళీ కృష్ణ, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.