బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌కు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రగతి భవన్ వేదికగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ అధికారులకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో రిటర్నింగ్ అధికారి, ప్రవర్తన నియమావళి బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ప్రగతి భవన్‌కు వెళ్లి విచారణ జరిపారు. దీనిపై వివరణ కోరుతూ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపనున్నారు.
“ప్రగతిభవన్ వేదికగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. ఇందులో భాగంగానే పురపాలక మంత్రి కేటీఆర్‌పై సోమవారం ఫిర్యాదు అందగా.. రిటర్నింగ్ అధికారిని, ప్రవర్తన నియమావళి బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను పంపించి విచారణ జరిపాం. దీనిపై మంత్రి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశాం. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ బంగ్లాలు, అతిథి గృహాల నుంచి ప్రచారం చేయకూడదు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రగతిభవన్‌లో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని వేర్వేరు పార్టీల నుంచి ఫిర్యాదులు అందాయి. వాటిపై విచారణ జరుపుతున్నాం.” అని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ తెలిపారు.