తెలంగాణలో వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ యాసంగి సీజన్‌లో మార్చి 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కురిసిన వడగండ్ల వర్షాల ప్రభావంతో పది జిల్లాల్లో 15,814 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం హామీ మేరకు రూ.15.81 కోట్లను రైతులకు పంట పరిహారం కింద చెల్లించాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆగిపోయింది.
రైతుల ఇబ్బందులు పరిగణలోకి తీసుకుని ఆ మొత్తం విడుదల చేయడానికి అనుమతి కోరగా ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రైతులకు పంట పరిహారాన్ని రేపటి నుంచి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపు నుంచి రైతుల ఖాతాలో పంట పరిహారం నగదు జమ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు నాటికి రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హామీ ఇచ్చారు.