ఎన్నికలు అయిపోయాయి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ధరలు పెంచుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హన్మకొండలో మాట్లాడారు. దొడ్డు వడ్లకు బోనస్ ఎగగొట్టింది. రేపో మాపో కరెంటు బిల్లులు పెంచుతుంది, ల్యాండ్ మార్కెట్ వాల్యూ పెంచుతుంది, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతుంది.. ఈ కాంగ్రెస్ పాలన సంక్షేమ పథకాల్లో కోతలు, పేద ప్రజల మీద బిల్లులు, ధరలు పెంచి వాతలు అన్నట్టు ఉందన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలలో ఒకే ఒక హామీ అమలు అయిందని.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ కూడా తస్సేనని ఎద్దేవా చేశారు. నారాయణఖేడ్ లో ఉపాధ్యాయులపై లాఠీ చార్జీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటుతో బుద్ది చెబితేనే కాంగ్రెస్ దారికి వస్తుందని హరీశ్ రావు పేర్కొన్నారు.