తెలంగాణ బీజేపీ నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు. బాటసింగారంలో రెండు పడక గదుల ఇళ్ల పరిశీలనకు వెళ్తామని నేతలు ప్రకటించిన నేపథ్యంలో.. జంట నగరాల్లో ఈ హౌస్ అరెస్టులు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను హైదరాబాద్‌లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇక దీనిపై ఈటల రాజేందర్ స్పందించారు.
బాటసింగారం వద్ద డబుల్ బెడ్ రూం ఇళ్ళను ఇవాళ పరిశీలించాలని బీజేపీ నిర్ణయించిందని… కానీ, నాతో సహా జంటనగరాల్లో ఉన్న బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని ఆగ్రహించారు. కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు ఈటల రాజేందర్. ప్రతీసారి అధికార పార్టీకి ఇది అలవాటుగా మారింది. ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసే హక్కు ప్రతిపక్షాలకు ఉందని తెలిపారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే బాధ్యత మాపై ఉంటుందని వివరించారు. కానీ, కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. మమ్ముల్ని నిర్బంధించినంత మాత్రాన మా పోరాటం ఆగదని హెచ్చరించారు. మీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని… అరెస్టులు మాకేం కొత్తకాదని తెలిపారు. మీ తీరు మార్చుకోకపోతే ప్రజలే మిమ్మల్ని మార్చడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్న మీకు వారే తగిన బుద్ధి చెప్తారు. అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను వెంటనే బేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాన్నారు ఈటల రాజేందర్.