రాష్ట్రంలో త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తనకు తెలియదని.. మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ లో ఆయన ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం పై పార్టీ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే.. దాని ప్రకారం నడుచుకుంటే తెలిపారు.
నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో బీజేపీ గతంతో పోల్చితే డబుల్ సీట్లు సాధించిందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో అధికారం దిశగా దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీల వైపు గాలి వీస్తున్నా.. తప్పుడు ప్రచారం జరుగుతున్నా ప్రజలు బీజేపీని ఆదరించారని తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2018లో బీజేపీ కేవలం 1 సీటు మాత్రమే గెలిచిందని.. కానీ 2023లో 23 సీట్లు గెలిచిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 36 లక్షల ఓట్లు తెచ్చుకుందని తెలిపారు. 15 శాతం ఓటు బ్యాంకును సాధించిందని పేర్కొన్నారు.