అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కోపంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. లోకసభ ఎన్నికల్లో మాత్రం కమలం పార్టీకే ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. గజ్వేల్‌లో మీడియాతో మాట్లాడిన ఈటల.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కావాలనే తమపై పొత్తుల విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని ఈటల మండిపడ్డారు.
మహిళల ఆత్మగౌరవం నిలబెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని ఈటల అన్నారు. 10 లక్షల మంది మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. మహిళలు, యువత అంతా కలిసి మోదీని మరోసారి గెలిపించుకోవాలనుకుంటున్నారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా కుంభకోణాలేనని ఈటల ఆరోపించారు. మోదీ నాయకత్వంలో ఎలాంటి మచ్చ లేకుండా బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోందని తెలిపారు. నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధాన మంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు.