తనపై వచ్చిన భూకబ్జాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. కేశవరం భూములను కబ్జా చేసినట్లు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం అని తెలిపారు. గిరిజనుల భూమిని మధ్యవర్తులు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. భూకబ్జాలు చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలు ఏం చేయడం లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరంలో సర్వేనెంబర్ 33, 34, 35లోని 47 ఎకరాల లంబాడీల వారసత్వ భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని శామీర్‌పేట పీఎస్‌లో భిక్షపతి అనే వ్యక్తి బుధవారం రోజున ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ వాణిరెడ్డి అక్రమంగా ఆభూమిని మల్లారెడ్డి అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. తహసీల్దార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వానికి బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు భూకబ్జాపై మల్లారెడ్డితో పాటు ఆయన కుమారులు, అనుచరులపై 420 చీటింగ్ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భూ హక్కు పత్రాలను తీసుకురావాల్సిందిగా ఫిర్యాదుదారులకు సూచించినట్లు చెప్పారు.