రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ, తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జీవో స్థాయికి చేరుకున్నాయని అన్నారు. రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తాము ఆధారాలతో నిరూపిస్తుంటే కొందరేమో ఎలాంటి ఆధారాలు లేకుండా రైతులు ఆత్మహత్యలు పెరిగాయని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్సీఈఆర్బి 2015 లో 1400 మంది రైతులు చనిపోయారని చెప్పిందని, ఆత్మహత్యలు క్రమంగా తగ్గి ఇప్పుడు జీరో కు వచ్చాయన్నారు. రైతు ఆత్మహత్యలు జరిగినట్లు ఇప్పటివరకు ఒక్క రైతు సంఘం కూడా ధర్నా చేయలేదన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కలను కూడా కొందరు నేతలు వక్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. పదివేల మంది చనిపోయినట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లేని ఆత్మహత్యలు ఉన్నట్టు చిత్రీకరించడం సరికాదన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.