టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు వందకు పైగా మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు నిందితులకు బెయిల్ లభించింది. మైబయ్య, జనార్దన్‌లకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు బెయిల్ పొందిన వారి సంఖ్య 17కు చేరింది.
ఇక మైబయ్య.. తమ కుమారుడు జనార్దన్ కోసం ఢాక్యా నాయక్ నుంచి రూ.2 లక్షలకు ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసినట్లు సిట్ అధికారుల విచారణలో తేలడంతో ఏప్రిల్ 21న మైబయ్య, ఆయన కుమారుడు జనార్దన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు.. ఈ కేసులో ప్రమేయమున్న 37 మంది నిందితులను డీబార్ చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ 37 మంది నిందితులు ఇకపై కమిషన్ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని టీఎస్పీఎస్సీ ఆదేశించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని నిందితులకు నోటీసులు జారీ చేసింది. లేకపోతే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ నియామక పరీక్షలు రాయకుండా డీబార్ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.