సాధారణంగా పెళ్లిళ్లు జరిగినప్పుడు చిన్నచిన్న గొడవలు కామన్. అమ్మాయి తరఫు వారు మమ్మల్ని పట్టించుకోలేదని అబ్బాయి తరఫున వారు అలుగుతుంటారు. ఆ తర్వాత అది కాస్త ఎవరో ఒకరి జోక్యంతో సర్దుమణుగుతుంది.కానీ తినేటప్పుడు మటన్ ముక్కలు రాలేదని కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా? ఇటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో అడపాదడపా దర్శనమిస్తున్నాయి. చిన్నచిన్న గొడవలు, తిట్టుకోవడం, అలిగి అబ్బాయి తరఫున వారు లేచివెళ్లిపోవడం చూస్తుంటాం. కానీ, మటన్ ముక్కలు రాలేదని ఏకంగా రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది.
నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఓ వివాహా వేడుక రసాభాసగా మారింది. పెళ్లి అనంతరం భోజనాలు చేస్తుండగా పళ్లెంలో మటన్ ముక్కలు రాలేదని వరుడి తరఫు బంధువులు గొడవకు దిగారు. అది కాస్త పెద్ద గొడవకు దారితీసింది. దీంతో వరుడు, వధువు తరపు బంధువులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు కొట్టుకున్నారు. ఏకంగా రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గొడవను సర్దుమణిచారు.అనంతరం 19 మందిపై కేసులు నమోదు చేశారు.