ఆన్​లైన్ విధానంలో నర్సింగ్‌ పోస్టుల భర్తీ

-

టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ సృష్టించిన గందరగోళంతో ఇక నుంచి వీలైనంత వరకు పరీక్షలను ఆన్​లైన్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా తాజాగా నర్సింగ్ పరీక్షను కూడా ఆన్​లైన్ విధానంలో నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు వేర్వేరు విభాగాల్లో 5,204 స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయడానికి వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ (టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) గత ఏడాది డిసెంబరులో నియామక ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే.

రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని, ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో జవాబుపత్రం ఉంటుందని ఆ నియామక ప్రకటనలో వెల్లడించారు. అయితే ఇటీవల ప్రశ్నపత్రాల వరుస లీకేజీ ఘటనల దృష్ట్యా… రాతపరీక్ష విధానానికి స్వస్తి చెప్పాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. నర్సింగ్‌ పోస్టుల భర్తీలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను నిర్వహించాలని ఇటీవల వైద్య మంత్రి హరీశ్‌రావు వద్ద జరిగిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో ప్రశ్నపత్రాన్ని జేఎన్‌టీయూ రూపొందించనుండగా… ఆన్‌లైన్‌లో పరీక్షల నిర్వహణలో అపార అనుభవమున్న ఓ సంస్థకు నర్సుల పోస్టుల నియామక పరీక్ష నిర్వహణ బాధ్యతను అప్పగించారు. వచ్చే వారంలో నియామక పరీక్షకు సంబంధించిన తేదీని టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ప్రకటించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version