ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశంతో పలు నగరాల్లో ఐటీ టవర్లు నిర్మించేందుకు రాష్ట్ర సర్కార్ యోచన చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మహబూబ్‌నగర్‌కు ఐటీ సేవలను విస్తరించేందుకు ప్రణాళిక చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాకు తలమానికం కానున్న ఐటి కారిడార్‌లో తొలి కంపెనీని ఇవాళ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
40 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటిటవర్‌ను ప్రారంభించాక 8 కంపెనీలతో ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. అనంతరం 262 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న అమరరాజ గిగా కారిడార్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కేటీఆర్ భూమి పూజ చేస్తారు. ఐటి కారిడార్‌లో నిర్మించిన రోడ్లను ప్రారంభించి.. పరిశ్రమల ఏర్పాట్లు, వాటికి కల్పిస్తున్న మౌలిక వసతుల కల్పనను కేటీఆర్ పరిశీలించనున్నారు.
మహబూబ్‌నగర్‌లోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తారు. భోజన విరామం తర్వాత నగరంలో అభివృద్దిచేసిన ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్ కూడలి, బస్టాండ్, రోడ్లు-భవనాల కూడళ్లను ప్రారంభిస్తారు. ఆ తర్వాత పెద్దచెరువు సమీపంలో కొత్తగా ఏర్పాటుచేసిన మిని శిల్పారామంను ప్రారంభించిన అనంతరం నెక్లెస్ రోడ్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు.